షూలో బూ రచన – కుళలి మానిక్కవేల్ మీరెప్పుడైనా బూలను చూశారా? అవి చాలా అల్లరి ప్రాణులు, రాత్రిపూట మంచం క్రింద చూశామని అనుకుంటున్నారు కదా. కొన్నేమో నారింజ రంగు చారల గుర్రాల్లా వుంటాయి, మరికొన్ని ఎగురుతున్న నత్తల్లా వుంటాయి. అవి మిమ్మల్ని అల్లరిపెట్టొచ్చు లేదా తుమ్ములొచ్చేలా చేయొచ్చు అవి మీ ఖాళీ జేబుల్లో చాకొలేట్లు ప్రత్యక్షమయ్యేలాకూడా చేయగలవు. బుడ్డి అనే బూ చూడ్డానికి కాస్తంత ఏనుగులాగా కనిపిస్తోంది, చాలావరకూ అది ఊదారంగులో వుంది, ఓ చుంచంత వుంది. ఒకరోజు ఉదయం, పొరపాటున మీరా, దానిమీద పడింది. అక్కడ అది ఎగబీలుస్తూ, మూలుగుతూ వుంది. దాని వెనకపక్క తన షూలోపల ఇరుక్కుపోయి వుంది. “నేను బహుశా కలగంటున్నానేమో,” అనుకుంది మీరా. ఏం జరుగుతుందో చూద్దామని దాన్ని వేలితో పొడిచింది. “అవుచ్!” అంది బుడ్డి. “ఓహ్! నన్ను మన్నించు,” అని ఆమె క్షమాపణలు చెప్పింది. “నేను ఇరుక్కుపోయాను!” అని పెడబొబ్బ పెట్టింది. నిజానికి అది రాత్రంతా అక్కడే ఇరుక్కుపోయుంది. ఇక అక్కడి నుంచి బయటపడతాననే ఆశకూడా వదిలేసుకుంది. మీరా దాన్ని దగ్గరగా పరిశీలించింది. “నేనేమైనా నీకు సాయం చేయగలనేమో చూద్దాం వుండు,” అని దాని కాళ్ళని పట్టుకు లాగింది. వెనక నుంచి దాన్ని తోసింది. షూ ని నేలకేసి కొట్టి కూడా చూసింది. “నేను నిన్ను సబ్బు నీళ్ళలో పెట్టి బయటకి తీయడానికి చూస్తానుండు,” అంది. కాని బుడ్డి మాత్రం వద్దంది, నురగ, బుడగలు అంటే బుడ్డి కి భయం. “అయితే నీ మీద నూనె పోసి చూడమంటావా?” అడిగింది. బుడ్డి, కీచుమని అరిచి, ఏడవడం మొదలెట్టింది. తన మీద నూనె మాత్రం ఖచ్చితంగా పోయొద్దని వేడుకుంది. “నీ ఏడుపు ఎలా ఆపాలో నాకు తెలుసులే!” అంది మీరా ఉల్లాసంగా. తను బుడ్డి ని కితకితలు పెట్టనారంభించింది. బూలకి కితకితలు చాలా ఎక్కువ, త్వరలోనే అది గుంజుకుంటూ, ముసిముసిగా నవ్వడం మొదలెట్టింది. మీరా దానికి కితకితలు పెట్టినకొద్దీ అది ఇంకా గింజుకుంటోంది, హఠాత్తుగా… “చూడు! నువ్వు బయటపడ్డావ్!” అని మీరా ఆనందంగా అరిచి, చప్పట్లు కొట్టింది. బుడ్డి ఓసారి కళ్ళార్పింది. కాళ్ళు జాడించి చూసింది. తోక కూడా జాడించి చూసింది. తరవాత శరీరం మొత్తం ఊగించి, నిజమో కాదో చూసుకుంది. “యా...! నేను బయటపడ్డాను!” అని, ఇక గదంతా గంతులేయడం మొదలెట్టింది. అది తన చేతిమీదకి ఎగిరి నవ్వింది. “నేనెళ్ళిపోడానికి ముందే నీకేం కావాలో చెప్పు? చాకొలేట్లా? పోనీ నీ బడిని మాయం చేసేయనా?” అని అడిగింది. “నువ్వు వెళ్ళే తీరాలా?” అని మీరా దిగులుగా అడిగింది. “ఇక్కడే వుండొచ్చుగా, మనం స్నేహితులుగా వుండొచ్చు!” అంది. బూలకి మనుషుల్లో స్నేహితులు లేరు. “ఈ ఆలోచన చాలా బావుంది!” అని కీచుగా అరిచింది. “నువ్వు ‘బుడ్డి బూ, నేను నిన్ను చూడాలనుకుంటున్నా’అను, నేను వచ్చేస్తాను!” అంది. “ఒట్టు?” అడిగింది మీరా. “నిజంగానే ఒట్టు!” అంది బుడ్డి. స్కూల్ బస్సు గట్టిగా హారన్ కొట్టింది. “సరే మరి. మనం బడి అయిపోయాక ఆడుకుందాం. తరవాత కలుద్దాం!” అని మీరా బయటకి పరిగెత్తింది. బడి అయిపోయిన తరవాత, మీరా తోటలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకుని అది అనమన్న మాటల్ని గొణుగుతున్నట్టుగా చెప్పింది. ఝమ్మని శబ్దం వచ్చింది, మెరుపులాగా బుడ్డి ప్రత్యక్షమైంది! పొద్దు క్రుంగేదాకా వాళ్ళు నవ్వుకున్నారు, ఆడుకున్నారు. ఇక ఆరోజు నుంచి మీరా ఇంకా బుడ్డి మంచి స్నేహితులైపోయారు.
BookBox
Our mission is to produce animated stories that are powered by Same Language Subtitling (SLS) a scientifically tested and proven approach to help improve reading skills and language learning, ultimately promoting a love for reading.
AniBooks flow from a simple fact – children love to watch cartoons. Thus, AniBooks are animated stories for children, with the narration appearing on-screen as Same Language Subtitles (SLS). BookBox was founded in 2004 after winning a business plan competition at Stanford University, called, the Social e-Challenge.